My Poetry

KVVS MURTHY|జ్ఞానీలు-26
కంటికి కనిపించే చాలా చిన్నవిషయాల్లోనే
చాలినన్ని విశ్వరహస్యాలు దాగిఉన్నాయని నా నమ్మకం
పుష్పం వికసించే క్రమంలోనే
ఆ అనంతవిశ్వం వికసిస్తున్నదేమో-
విత్తనం నశించి తను వృక్షంగా మళ్ళీ
ఎలా ఎదుగుతుందో
ప్రపంచ వినాశం కూడా అలాంటిదేనేమో...
మన ఆలోచనల ప్రకారం భౌతికవిజ్ఞానం
విస్తరించడం సైతం విశ్వప్రణాళికలో ఒక భాగమేనేమో..
నా ఆలోచన-నీ ఆలోచన
అసలు నీది,నాదేనా...దానికి మించిన

అంతర్లోకాలనుంచి ప్రవహిస్తున్న ధారావాహికలా..!
-----------------------------------------------
14-2-2014




KVVS MURTHY|జ్ఞానీలు-24
ఏ అపరాత్రి పూటో
కళ్ళు తెరిచి పైకి చూస్తానా..


ఆకాశం అంతా చెల్లాచెదరైన నక్షత్రాలు
మౌనంగా తమలో తాము మాట్లాడుకుంటూ
సేదతీరుతున్నట్టు...
ప్రతి తార ఒక సూర్యుడే కదా..!
ఎటువైపు చూస్తే అటువైపు ఎంతమంది సూర్యులు ..?
ఇంత వ్యవస్థ ఎవరికోసం..?
ఎవరు ఎవరి కోసం పన్నిన రహస్య వ్యూహమిది...?!
---------------------------------
11-2-2014





KVVS MURTHY|జ్ఞానీలు-46
ఒకరి మీద అధికారం చెలాయించడం అంటే
మనిషికి ఎంత ఇష్టం...
అన్ని పనుల వెనుకన్న పరమార్ధమదేనేమో...
అధికారం కూడా ఆలోచిస్తే ఒక గణిత సూత్రమే...
కారణం ఏమైనా కాని...మనకి లోబడినవారిని మాత్రమే
మనం అధికారించగలం...
ప్రతివారి దగ్గరా తుపాకి ఉండనీ
ఎవరూ ఎవరితో అవసరానికి మించి వ్యవహరించరు...!

KVVS MURTHY|జ్ఞానీలు-41
పైకి ఏదో అంటాం గాని
మరణం మీద ప్రేమ లేనిదెవరికి...?

నీకు నీవు పైకి చెప్పుకోలేని ప్రేమ అది

నీ సమస్త గాయాల నుంచి విముక్తి చేసేదది

అది నీకు వేరే ఎవరో చెప్పాలా...?
నీ అంతర్ గ్రహం లో జరిగే నిష్కల్మష సంభాషణమది.. !
జీవితాన్ని ప్రేమించు...
అలాగే మరణాన్నీ ఆహ్వానించు...!
అది నిన్ను ఇంకో తీరానికి కొనిపోయే నావ ..!
-----------------------------------
25-4-2014




KVVS MURTHY|జ్ఞానీలు-38
నీ అంతర్ ప్రపంచం లో
సమస్త రహస్య అనుభవాలను
పంచుకునే ఒక రూపం
నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది...
అక్కడ నీకు నిత్య యవ్వనమే
అలుపు లేని స్వైర కల్పనలే

కల నెరవేరకపోవడం కూడ ఒక్కోసారి వరమే...!
----------------------------------
17-4-2014






    KVVS MURTHY|జ్ఞానీలు-35
    బొంది లో కరెంట్ ఉన్నట్టుండి
    కట్ అయినపుడు
    అంతసేపు నవనవలాడే
    దేహం బిర్ర బిగుసుకొని
    కట్టెలా మారిపోతుంది...
    సంపాదించుకున్న అనుభవాలన్నీ
    అంతటితో తెగిపోవలసిందేనా...?
    పునర్జన్మ ఉంటేగనక
    అక్కడికి బదిలీ అవుతాయా ...?
    ఏ ఉపన్యాసమూ..ఏ ఉపదేశమూ
    ఈ దాహాన్ని పూర్తిగా తీర్చదెందుకని..?
    శూన్యంలో ప్రవహించే వాయువు వంటి మన్సు ఏదో చెబుదామని
    ప్రయత్నం చేస్తూనే ఉంటుంది...
    అంతర్జాలంలో ఒక కిటికీ నుంచి
    ఇంకో కిటికీ కి ఎలా పోతుంటామో
    అంతర్ ప్రపంచంలో కూడా అదే తంతు..!
    -------------------------------------------------
    30-3-2014
మాటలు
ఒక్కొక్కసారి వాటి


భావాన్ని సరిగా మోసుకుపోలేవెందుకని..?

మాటలు

ఒక్కొక్కసారి

ఒట్టి శబ్దాల వలెనె

ధ్వనిస్తాయెందుకని....?

మాటలు

ఒక్కొక్కసారి
వాటి వ్యతిరేక భావాన్ని
వ్యక్తంచేస్తాయెందుకని...?
మాట ఒక్కొక్కసారి కుంటిది...!
మాట ఒక్కొక్కసారి మూగది...!








KVVS MURTHY|జ్ఞానీలు-47
"ధన యోగం" అనే మాట ఎందుకు ఎందుకొచ్చిందో
అని అనుకొనేవాడిని చిన్నప్పుడు...


జనారణ్యం లో నా యాత్ర మొదలుపెట్టినప్పటినుంచి

తెలుస్తోంది....

ఇక్కడ ఒకరి జేబులోనుంచి

ఒక రూపాయి మన జేబులోకి

రావాలంటే ఎంత ఓరిమి వహించాలో ..

ఉన్న రూపాయిని కాపాడుకోవాలంటే ఎంత

జాగరూకతతో ఉండాలో...

బంధువులు,స్నేహితులు ఎవరూ
నిజ సహకారులని నమ్మడానికి లేదు...
ఈ వేటలో ఎప్పుడూ మనిషి ఒంటరి గా ఉండవలసిందే...
సంసారం కంటే గుట్టుగా చేయలసినదేమైనా ఉందంటే
అది ధనార్జనే...
ఇది ఏ విద్యాలయం లోనూ నేర్పని విద్య..
అసలు దీనికి విద్యతో కూడ సంబంధం లేదు...
అసలు ధనం సంపాదించే పరిణామక్రమం లోనే
మనుషుల స్వరూపం అర్ధం అవుతుంది...
ఈ ప్రపంచమూ అర్ధం అవుతుంది..!





బంధాలు|Murthy Kvvs

రైలు బోగీ లో కూర్చుంటామా..

ఎవరో వస్తారు..ఏదో మాట్లాడుతారు

ఆ కొన్ని గంటలు వాళ్ళు మన కోసమే 

పుట్టారా అనిపిస్తుంది...

స్టేషన్ రాగానే 

ఎవరి తొందర వారిది...ఎవరి దోవ వారిది..!

ఆలోచిస్తే బయటా అంతే..

జీవిత చక్రాలు మెత్త గా తిరగాలంటే 

సం ' బంధాలు అవసరే కదా..! 



ప్రణాళిక| Murthy Kvvs

ఒక ప్రణాళిక ప్రకారమే 
ఊగాలని ఆకులూ అనుకుంటాయి..

ఏ గాలి ఏ వైపు నుంచి వీస్తుందో వాటికి మాత్రం 
ఏం తెలుసు కనక..

ఎవరి జీవితాన్ని వారు తమ ప్రణాళిక మేరకే
రూపొందించుకోవాలనుకుంటారు..

ఏ అనుభవాలు ఏ వైపు నుంచి ఏ దిశకి రోసుకుపోతాయో 

ఎవరికి ఎరుక...

జీవితం అంతా మన ప్రణాళిక కాదు..

అలాగని అనిపిస్తే అది నీ తప్పు కాదు..! 



సుహృద్భావం..| Murthy Kvvs

ఆకులు మంద్రంగా ఊగుతున్నప్పుడో 

శరీరాన్ని సుతారంగా స్పృశించ్చినపుడో ,అపుడు గదా..

కంటికి కనబడని చిరు గాలిని అనుభూతిస్తాము..

ఎదుటి మనిషి లోని 

ఏ సుగుణం నిన్ను 

ఆకర్షించినా

వ్యక్తం చెయ్యి నీ అభిమానాన్ని..

చేతల ద్వారానో,కంటి చూపు ద్వారా నో,మరే విధంగా నో ..

నీ ప్రేమ నీలో నే దాచుకుంటే 

ఎలా విస్తరిస్తుంది సుహృద్భావం...! 




రహస్యం| Murthy Kvvs

కంటికి కనిపించే చాలా చిన్న విషయాల్లోనే

చాలినన్ని విశ్వ రహస్యాలు 

దాగి ఉన్నాయని నా నమ్మకం..

పుష్పం వికసిస్తున్న తీరు లోనే 

ఈ అనంత విశ్వం వికసిస్తున్నదేమో..

విత్తనం నశించి ,తను వృక్షంగా

మళ్ళీ ఎలా ఎదుగుతుందో- 

ప్రపంచ వినాశం అలాంటిదేనేమో..

భౌతిక విజ్ఞానం విస్తరించడం సైతం

విశ్వ ప్రణాళిక లో ఒక భాగమేనేమో..

నా ఆలోచన,నీ ఆలోచన 

అసలు నీది నాదేనా..?

ఏ అంతర్లోకాలనుంచో 

ప్రవహిస్తున్న ధారా వాహికలా..?





ఇల్లు| Murthy Kvvs

ప్రతి ఇంటిలోను

కావలసింత చెత్త ఉన్నది...

ప్రతి ఇంటి లో 

కావలసినంత జ్ఞానమూ ఉన్నది..

నా ఇల్లు అంటే నాకు కూరిమి

నీ ఇల్లు అంటే నీకూ అంతే..

ఇంటిని కాదని బయటికి రావాలంటే కొంత 

అరాచకమూ కావాలి..!

నేను ఇక్కడ ఇల్లు అన్నది 

మతం గురించి..!





ఒంటరితనం| Murthy Kvvs

వెన్నెల కురిసే రోజుల్లో 

ఒక అర్ధ రాత్రి పూట

సముద్రం ముందు కూర్చున్నావా ఎపుడైనా ..?

ఒంటరి తనం లోని ఆనందం-భయం-స్వేచ్చ 

ముప్పేట గా అల్లుకొని 

మతి భ్రమించిన  సర్పం 

చేసే నృత్యం చూశావా ఎపుడైనా ..?





వ్యూహం| Murthy Kvvs

ఏ అపరాత్రి పూటో

కళ్ళు తెరిచి పైకి  చూస్తానా..?

ఆకాశం అంతా చెల్లా చెదరైన నక్షత్రాలు...

మౌనంగా తమ లో తాము మాట్లాడుకుంటూ

సేదతీరుతున్నట్టు...

ప్రతి తార ఒక సూర్యుడే గదూ 

ఎటు వైపు చూస్తే  అటు వైపు

ఎంత మంది సూర్యులు..?

ఇంత వ్యవస్థ ఎవరి కోసం..


ఎవరు ఎవరి కోసం పన్నిన రహస్య వ్యూహమిది..?  

*              *

అదే నేను,అదే నీవు KVVS MURTHY 

నిన్ను శాశ్వతంగా ప్రేమించడానికి గాని

నిన్ను శాశ్వతంగా ద్వేషించడానికి గాని

ఇక్కడెవరూ లేరు ...!

ఒక్క కంటి చూపు,ఒక్క నోటిమాట ఒక్కో మాటు 

నీ ప్రమేయం లేకుండానే నీకు ద్వేషుల్ని గాని ప్రేమికుల్ని గాని తెచ్చిపెడుతుంది! 

ఏ ఇద్దరి ప్రపంచాలూ ఇక్కడ నూరు శాతం ఒకేలా ఉండవు..

మొహమాటానికో,మనుగడ కోసమో సర్దుకుపోవడం లోని హాయి 

ఎవరకి ఎవరు నేర్పాలి గనక..!

ఇక్కడ ఎవరి సిలువ వారే మోసుకుపోతూండాలి 

ఆ బాటలో ఒక్కోమారు చెమటపట్టిన నీ మేని మీదకి 

చిరుగాలి లా వీస్తూ ఎదురవుతుంటారు..మళ్ళీ అంతలోనే అంతర్ధానమవుతుంటారు..! 

నీ ప్రయాణం లోని మర్మం ఎరిగినపుడు 

నీతో ఎవరున్నా లేకున్నా నీకు ఏమీ అనిపించదు..

తప్పిపోయిన గొర్రెపిల్ల ఎక్కడో లేదు ,అదెప్పుడూ నీతోనే ఉన్నది...!

------------------------------------------------
16-2-2015  



Don't tell me how educated you are,tell me how much you have travelled.
--Prophet Mohammed
KVVS MURTHY|జ్ఞానీలు-36
ప్రయాణాల్లోనే తెలిసింది
జీవితం విలువేమిటో...
ప్రయాణమే నేర్పించింది
ప్రపంచమెంత విశాలమో..
దాని పొరలకింద ఎంత
గ్రంధాలకందని వికాసమున్నదో..
ప్రయాణమే పంచేద్రియాలకి
ఇంకొక ఇంద్రియాన్ని జత చేర్చేది..
దేహస్థితి ని దాటని వారికి
ప్రయాణం గూర్చి ఎంత చెప్పినా వృధయే..!
--------------------------------------




KVVS MURTHY|జ్ఞానీలు-38
నీ అంతర్ ప్రపంచం లో
సమస్త రహస్య అనుభవాలను

పంచుకునే ఒక రూపం
నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది...
అక్కడ నీకు నిత్య యవ్వనమే
అలుపు లేని స్వైర కల్పనలే
కల నెరవేరకపోవడం కూడ ఒక్కోసారి వరమే...!
----------------------------------



KVVS MURTHY|జ్ఞానీలు-40
మానవజీవిత పరమార్ధమేమిటని
ప్రపంచం కళ్ళుతెరవని నాడు
చింతన చేసింది ఇచటనే...!
ఎందుకో పుట్టామో,పెరుగుతున్నామో
తెలియని లక్ష్యహీనులై
బ్రతుకునీడ్చే జీవులూ ఇచటనే...!
స్త్రీని శక్తిస్వరూపిణిగా కొలిచేది ఇచటనే...!
ఆడశిశువుల్ని చిద్రం చేసే సంస్కృతి ఇచటనే...!
"సర్వేషాం మంగళం భవతు " అనేది ఇచటనే...!
మనిషిని చూడగానే వీని కులం ఏమయి
ఉండవచ్చునని యోచించేదీ ఇచటనే...!
పెద్దలని గౌరవించమనేది ఇచటనే..!

వృద్ధ బిక్షువులు ఏ చెట్టుకిందనో జంతువుల వలె మరణించేది ఇచటనే...!





KVVS MURTHY|జ్ఞానీలు-43
పిట్టలు నిద్రలేచేవేళ చూస్తుంటాను..
అలారం పెట్టి ఎవరో లేపినట్లు

కిచకిచలాడుకుంటూ పొద్దుటే లేచిపోతాయి..!
అప్పటికి సూర్యుడు కూడా సరిగా నిద్రలేవడు..
గూళ్ళలోనుంచి జట్లు జట్లుగా
గాలి తరంగాలలో ఈదుకుంటూ
అలా వెళ్ళిపోతుంటాయి..
మళ్ళీ సూర్యుడు సాయంవేళ దిగుతుండగా
గూళ్ళలో దీపాలు వెలిగించడానికా అన్నట్లు
వెనుదిరిగి వస్తూనే ఉంటాయి..
ఒక వేళ ఏ పిట్ట అయినా ఆ రాత్రికి రాలేదో,
ఇక ఎన్నటికీ రానట్లేనని అర్ధం..
గూటిలోని దానిపిల్ల రేపు తన రెక్కల కష్టంతో ఎగరవలసిందే
లేదా తన చావు తాను చావవలసిందే...!
------------------------------------------
(13-5-2013)




KVVS MURTHY|జ్ఞానీలు-45
నోరు తిరగక సంస్కృతాన్ని
మట్టిబుర్రకి వంటబట్టక ఇంగ్లీష్ ని


ద్వేషించినపుడు నాకదొక తృప్తి కలిగేది..

నా మాతృభాషకి పట్టువస్త్రాల్ని

సమర్పిస్తున్న అనుభూతి కలిగేది....

ప్రతి భాష లోను తనదైన జీవమున్నది

విఫలమైన క్షణం లోనే అసహనం హద్దుమీరుతుంది..

నాకది తెలిసేసరికి నాలాంటివారు

నా పక్కన చాలామంది ఉన్నట్లు అర్ధమయింది...!
-----------------------------------------
26-5-2014





KVVS MURTHY|జ్ఞానీలు-49
ఒకరి మీద రాయి వేయాలనుకుంటే
అలవోకగా వేసేస్తాం...

ఒకరిలో ఏదో నచ్చి అభినందించాలంటే

మాత్రం హృదయం గొంతు నొక్కి
ఆపేస్తాం...
ఎవరూ ఇక్కడకి పేద గా రాలేదు...
తమదైన ఏదో ఒక సంచితశక్తి తోనే జన్మించారు
అది తెలుసుకున్ననాడు
అసూయకు తావే ఉండదు...!
--------------------------------------31-5-2014



KVVS MURTHY|జ్ఞానీలు-48
కళ్ళ ఎదుటే అను నిత్యం
అనేక చావులు సంభవిస్తున్నా

నీవు తొణకవు,బెణకవు

కాని నీ నుంచి వచ్చిన ఒక జీవి
కన్ను మూస్తే మటుకు ప్రపంచమే
నీకు విషాదమవుతుంది కదూ...
ఎందుకని...అది నీది కనకనా...?
నీది అనుకున్నది ,నీది కాదని
తెలియజెప్పడానికే
ప్రకృతి నిరంతరం
అనేక మార్గాల్లో తన పనిని
తాను చేసుకుంటూ అలా...!!!
---------------------------------------

29-5-2014




KVVS MURTHY|జ్ఞానీలు-46
ఒకరి మీద అధికారం చెలాయించడం అంటే
మనిషికి ఎంత ఇష్టం...

అన్ని పనుల వెనుకన్న పరమార్ధమదేనేమో...

అధికారం కూడా ఆలోచిస్తే ఒక గణిత సూత్రమే...
కారణం ఏమైనా కాని...మనకి లోబడినవారిని మాత్రమే
మనం అధికారించగలం...
ప్రతివారి దగ్గరా తుపాకి ఉండనీ
ఎవరూ ఎవరితో అవసరానికి మించి వ్యవహరించరు...!
-----------------------------------------
27-5-2014


చివరకి మిగిలేది |కె.వి.వి.ఎస్.మూర్తి 

నాలో ఒక ప్రపంచం ఉంటుంది

కొన్ని సార్లు అది లీల మాత్రంగా మాటల ద్వారా వ్యక్తం అవుతుంది

ఇంకొద్దిగా నా పనుల లో రూపుదాల్చుతుంది

సింహభాగం ఎవరికీ తెలియకుండా నాతో బాటే


చితిలో కాలి బూడిద అవుతుంది...!